69 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు..మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఊరట!

16 Dec, 2022 15:19 IST|Sakshi

69 మంది చిన్నారుల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్‌ఓ అనుమానం వ్యక్తం చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 

పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలకు మైడెన్‌ ఫార్మా తయారు చేసిన డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్  మోతాదు పరిమితికి మించి ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  అనుమానం వ్యక్తంచేసింది. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్‌ల నుండి తీసిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్టులు నిర్వహించగా అందులో ఎలాంటి తప్పు లేదని తేలింది. కాబట్టి, తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వ అనుమతి కోరినట్లు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది.

ఈ సందర్భంగా మైడెన్‌ ఫార్మా మేనేజింగ్‌ డెరెక్టర్‌ నరేష్‌ కుమార్‌ గోయల్‌ మాట్లాడుతూ.. భారతీయ నియంత్రణ, న్యాయ వ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ‘మేం ఇప్పుడు ఫ్యాక్టరీని పునప్రారంభించేలా అధికారులను కోరుతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అనుమతుల కోసం మేం ఇంకా వేచి ఉన్నాం అని తెలిపారు.  

ఈ ఏడాది నవంబర్‌ నెలలో 69 మంది పిల్లల మరణాలకు మైడెన్‌ ఫార్మా కంపెనీ దగ్గు,జలుబు సిరప్‌లు సంబంధం కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు హర్యానాలోని సోనేపట్‌లోని మైడెన్ మ్యానిఫ్యాక్చరింగ్‌ కంపెనీలో మెడిసిన్‌ తయారీని నిలిపివేశారు. దగ్గు మందుపై కేంద్రం టెస్టులు నిర్వహించింది. 

ఈ తరుణంలో డిసెంబర్ 13న ఇండియన్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ వీజీ సోమాని..డబ్ల్యూహెచ్‌ఓకి లేఖ రాశారు. ఆ లేఖలో మైడెన్ ఉత్పత్తి చేసిన దగ్గు మందులపై టెస్టులు నిర్వహించాం. ఆ నమోనాలు సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపెట్టాం. వాటిలో చిన్న పిల్లలో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీసే డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలు నమోనాలు లేవని గుర్తించామని పేర్కొన్నారు. 

పరీక్షల ఫలితాలను తదుపరి చర్య కోసం నిపుణుల బృందానికి పంపామని డబ్ల్యూహెచ్‌ఓకి రాసిన లేఖలో సోమాని తెలిపారు. చండీగఢ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ పరీక్షలను నిర్వహించిందని ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ లేఖపై డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటి వరకు స్పందించలేదు. 

మరోవైపు అక్టోబర్‌లో యూఎన్‌ ఏజెన్సీ మైడెన్ తయారు చేసిన ఉత్పత్తులలో విషపూరితమైన, తీవ్రమైన కిడ్నీలను నాశనం చేసే డైథైలిన్ గ్లైకాల్,ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు