వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..!

11 Apr, 2022 21:09 IST|Sakshi

ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన కోసం ఒక సగటు ఉద్యోగి తన జీవిత కాలాన్ని పూర్తిగా ఆఫీసుల్లోనే గడిపేస్తున్నాడు. వారంలో ఐదు/ఆరు రోజుల పాటు ఆఫీసుల్లో జాబ్‌ చేస్తూ వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్న వారు ఎందరో. నేటి ప్రపంచంలో ముందుడాలంటే జాబ్‌పై  మరింత సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకుగాను కార్యాలయాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానం ఎంతగానో ఉపయోగపడుతోందని ఒక సర్వేలో తేలింది. 

వారానికి నాలుగు రోజులు పనికి సిధ్దం..!
ఇంట్లో, ఆఫీసుల్లో ఒత్తిడి లేని, ఆహ్లాదకరంగా గడిపేందుకుగాను పలు కంపెనీలు వారంలో నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలను చేస్తున్నాయి. ఇక భారత్‌లోని ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పాటు డ్యూటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు  హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఓ సర్వే తేలింది. భారత్‌లోని 60 శాతం కంపెనీలు వారంలో 4 రోజుల పనికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పని విధానంతో ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని కంపెనీలు భావిస్తోన్నట్లు సమాచారం. ఈ సర్వేను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు జీనియస్ కన్సల్టెంట్స్  నిర్వహించింది. దీనిలో 1,113 కంపెనీలు పాల్గొన్నాయి. బ్యాంకింగ్,  ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ బీపీవో, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ సర్వేలు పాల్గొన్నాయి.

ప్రోడక్టివీటిలో మార్పులు..!
వారానికి నాలుగు రోజుల పని విధానంతో... ఉత్పాదకతలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించాయి. 27 శాతం కంపెనీలు ఉత్పాదకత విషయంలో ఏం చెప్పలేకపోయాయి. మరో వైపు 11 శాతం కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలతో ఉత్పాదకతో గణనీయమైన మార్పులు వస్తాయని భావించారు. ఇక నాలుగు రోజుల పని విధానంపై 100 శాతం మంది ఉద్యోగులు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అదనంగా ఒక రోజు సెలవును పొందేందుకుగాను రోజుకు 12 గంటల వరకు పనిచేసేందుకు సిద్దమని ఉద్యోగులు తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్న 52 శాతం కంపెనీలు, ఉద్యోగులు శుక్రవారం రోజున మూడో సెలవు ఉంటే బాగుంటుందని తెలియజేశారు. అయితే 18 శాతం కంపెనీలు, ఉద్యోగులు సోమవారం లేదంటే బుధవారం సెలవు ఉంటే పని నుంచి కాస్త బ్రేక్‌ దొరికినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. 

చదవండి: వేతన జీవులకు అదిరిపోయే శుభవార్త..!

మరిన్ని వార్తలు