తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు

15 Sep, 2021 19:58 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. డైమండ్ & జ్యూయలరీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు గల మలబార్ గ్రూప్ తెలంగాణలో ₹750 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రంలో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా డైమండ్ & జ్యూయలరీ స్టోర్స్ ఉన్నాయి. 

నేడు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిసి కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ఆయన పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరుల లభ్యతతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మలబార్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూపును మంత్రి కేటీఆర్‌ తెలంగాణాకు స్వాగతించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల వివిధ జిల్లాల్లో నైపుణ్యం కలిగిన స్వర్ణకారులుకు ఉపాధి లభిస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు