అప్పులు తగ్గించుకునేందుకు కట్టుబడి ఉన్నాను: సీఈఓ

8 Dec, 2020 09:10 IST|Sakshi

బెంగళూరు: కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌.వి. రంగనాథ్‌ని తాత్కలిక చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భార్య మాళవిక హెగ్డేని సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

మాళవిక కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. కాగా కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిలను నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారు. 2019 జూలైలో వీజీ సిద్ధార్థ మృతి చెందగా.. ఆత్మహత్యే ఆయన మరణానికి కారణమని అంతా భావిస్తున్నారు. సిద్ధార్థ మరణించే సమయానికే కంపెనీకి అప్పుల భారం మొదలుకాగా... ఆయన చనిపోయిన నాటి నుంచి గత ఏడాదిగా అప్పులు తీర్చే ప్రయత్నాల్లో సీడీఈఎల్ తలమునకలవుతూ వస్తోంది. (చదవండి: కాఫీ డే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను)

బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశం అంతటా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి భారతదేశంలో వృద్ధి చెందుతున్న మనీడ్‌ క్లాస్‌ జనాల కోసం కాపుచీనో, లాట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. కాఫీ డే.. స్టార్‌బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీ వంటి వాటితో పోటీపడతుంది. ఈ క్రమంలో సిద్ధార్థ మరణం సంస్థ భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. అతని మరణం గురించి వార్తలు వెలువడడంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు క్రాష్ అయ్యాయి. చివరికి ఫిబ్రవరి 3 నుంచి వాటి ట్రేడింగ్‌ నిలిపివేయబడింది.

మరిన్ని వార్తలు