అమెజాన్‌ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!

18 Jan, 2023 20:48 IST|Sakshi

సాక్షి,ముంబై: టెక్‌ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కలకలం రేపుతోంది. గ్లోబల్‌ ఆర్థికమాంద్యం ముప్పు, ఖర్చుల నియంత్రణలో భాగంగా దిగ్గజాల నుంచి స్టార్టప్‌లదాకా వందలాది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండటం ఆయా కుటుంబాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తాజాగా కెన్యాకు చెందిన టెకీ  టామ్‌ ఎంబోయా ఒపియో  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌  వైరల్‌గా మారింది.  మరో నాలుగు రోజుల్లో యూరప్‌కు మకాం మార్చాల్సి ఉండగా అమెజాన్‌ ఉద్యోగాన్ని కోల్పోయిన వైనాన్ని ఒపియో లింక్‌డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు కొన్ని గ్లోబల్‌ ఐటీ ఉద్యోగాలకు సంబంధించి చిట్కాలను షేర్‌ చేయడం విశేషంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే అమెజాన్ భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల ఉద్యోగుల్లో తానూ ఒకడినని, ఐరోపా వెళ్లడానికి నాలుగు రోజుల ముందు తాను ఉద్యోగాన్ని కోల్పోయానంటూ కెన్యా టెకీ ఒపియో  తెలిపారు. కుటుంబంతో సహా  వెళ్లేందుకు, ఉన్న ఇల్లును, కార్లను అమ్మేశా. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండి ఉంటే ఈ సోమవారం (జనవరి16) అమెజాన్‌లో ఉద్యోగంలో చేరేవాడిని. కానీ పరిస్థితి తారుమారైంది. తర్జన భర్జన పడి, 6 నెలల నుంచి ఎంతో కష్టపడి ప్లాన్‌ చేసుకొని, ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే  ఉద్యోగాన్ని  కోల్పోడంతో తన ఫ్యామిలీ కుప్పకూలి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ షాక్‌నుంచి తేరుకుని మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా టెకీలకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.   (రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్‌ టెకీ భావోద్వేగం)

‘‘వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే..ముందు మీరు వెళ్లి..ఆ తరువాత ఫ్యామిలీని తీసుకెళ్లడం గురించి ఆలోచించండి...వీసా వచ్చే వరకు తమ ప్రస్తుత జాబ్‌కు రాజీనామా చేయకండి’’ (మాకు వీసా రావడానికి 5 నెలలకు పైగా పట్టింది. ఫ్యామిలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, కొత్త పాస్‌పోర్ట్‌లు, EU వర్క్ ఆథరైజేషన్ అప్రూవల్స్, డాక్యుమెంట్‌ల నోటరైజేషన్ పొందడానికి చాలా సమయం పట్టింది). కరీయర్‌లో ఈ టైంలో ఇంతటి కష్టమైన పరిస్థితి వస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. కానీ జీవితం అంటే అదేకదా? మనకెదురైన అనుభవాలు, పరిస్థితులు, ఇతరులకు ఉదాహరణలుగా, పాఠాలుగా నిలుస్తాయంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.  

కాగా గత కొన్ని నెలల్లో ఉద్యోగాల కోతలను ప్రకటించిన  పలు దిగ్గజ కంపెనీలలో అమెజాన్ కూడా ఒకటి. ట్విటర్‌, మెటా మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు