కేజీఎఫ్‌ లాంటి సూపర్‌ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!

29 Mar, 2023 19:25 IST|Sakshi

న్యూఢిల్లీ: గుండె నిండా ధైర‍్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు.  ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను  రక్షించడం  ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం  ఈ సంఘటన చోటు  చేసుకుంది.  భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి  సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ  లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో  అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర  ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. 

సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు