మణప్పురం లాభం పతనం

19 May, 2022 06:23 IST|Sakshi

44 శాతం క్షీణించి రూ.261 కోట్లకు

న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్‌ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్‌ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్‌లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది.

నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్‌ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్‌ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది.

మరిన్ని వార్తలు