Mankind Pharma: అతిపెద్ద ఐపీవో బాట

17 Sep, 2022 09:58 IST|Sakshi

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మా తాజాగా పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా రూ. 5,500 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. (Akasa Air: వారానికి 250కి పైగా ప్లయిట్స్‌)

కంపెనీ వివిధ విభాగాలలో ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్ల తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్‌లను చేపడుతోంది. కన్జూమర్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. ప్రమోటర్లు రమేష్, రాజీవ్‌ జునేజాతోపాటు షీతల్‌ అరోరా కోటి షేర్లకుపైగా షేర్లను విక్రయించనుండగా.. ఇన్వెస్టర్‌ సంస్థ కెయిర్న్‌హిల్‌ సీఐపీఈఎఫ్‌ 1.74 కోట్ల షేర్లు, కెయిర్న్‌హిల్‌ సీజీపీఈ దాదాపు కోటి షేర్లు చొప్పున ఆఫర్‌ చేయనున్నాయి.

ఇదీ చదవండి: లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి

కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో మెక్‌లాయిడ్స్‌ ఫార్మా రూ. 5,000 కోట్ల సమీకరణకు ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అయితే కంపెనీ విలువ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హెల్త్‌కేర్‌ విభాగం(2020 నవంబర్‌)లో గ్లాండ్‌ ఫార్మా రూ. 6,480 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోకు తెరతీసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు