ద్రవ్యోల్బణం తీవ్రతలోనూ తయారీ రంగం స్థిరం!

2 Jun, 2022 10:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ తయారీ రంగం (మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 75 శాతం) మే నెల్లో స్థిరంగా ఉంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) మే నెల్లో దాదాపు ఏప్రిల్‌ (54.7) స్థాయిలోనే 54.6 వద్ద ఉంది. వ్యవస్థలో తీవ్ర ధరల పెరుగుదల పరిస్థితి ఉన్నప్పటికీ ఎస్‌అండ్‌పీ సూచీ దాదాపు స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హం. 

మే నెల్లో ఉత్పత్తి, ఆర్డర్లు పెరిగాయని, డిమాండ్‌లో రికవరీ ఉందని సూచీ అంశాలు వివరించాయి. పలు రంగాలు రికవరీ బాటన నడిచాయి. ఎగుమతుల పరిస్థితి బాగుంది. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. అమ్మకాల పెరుగుదల నేపథ్యంలో మేలో తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డం మరో కీలకాంశం. స్వల్పంగానే అయినా, 2020 జనవరి తర్వాత ఉపాధి కల్పన విషయంలో కొంత సానుకూల పరిస్థితి కనిపించింది. 

మరోవైపు వరుసగా 22వ నెల ముడి పదార్థాల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్, ఇంధనం, రవాణా, ఫుడ్‌స్టఫ్, మెటల్స్, జౌళి రంగాల్లో ధరల పెరుగుదల కనబడింది. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బిజినెస్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. 


 

మరిన్ని వార్తలు