Old Phones: చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ! 

14 Sep, 2021 00:20 IST|Sakshi

ఉత్పత్తికి సరఫరా ఆటంకాలు 

చైనాలో ఆంక్షలతో విడిభాగాలకు కొరత 

దీంతో పాత ఫోన్లకు డిమాండ్‌ 

న్యూఢిల్లీ: సరఫరాల్లో సమస్యల కారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ తగ్గింది. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల విచక్షణారహిత వినియోగానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్‌ ఫోన్లకు (నవీకరించినవి) గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్‌ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యంత్రా అన్నది  మొబైల్‌ రిపేర్, రీఫర్బిష్డ్‌ సేవల్లోని కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్‌జా మాట్లాడుతూ.. రూ.4,000–6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్ల నిల్వలు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే నవీకరించిన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గడిచిన ఏడాది కాలంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్‌సెట్‌లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. వచ్చే 12–18 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 450 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. యంత్ర ప్లాట్‌ఫామ్‌ వినియోగించిన ఫోన్లను ఆన్‌లైన్‌ వేదికగా కొనుగోలు చేస్తుంటుంది. వాటిని నిపుణులతో తనిఖీ చేయించి తిరిగి మంచి స్థితిలోకి తీసుకొచ్చి  (రీఫర్బిష్డ్‌) విక్రయిస్తుంటుంది. కొత్త ఫోన్ల మాదిరే రీఫర్బిష్డ్‌ ఫోన్లపైనా ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. కరోనా రాకతో ఆన్‌లైన్‌ వినియోగం పెరగడం తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్‌ల సాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌ పాఠాలకు మళ్లడం చూశాం. ఈ పరిస్థితులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్‌ను పెంచేశాయి.  

4.8 కోట్ల విక్రయాలు..  
గతేడాది కరోనా వచ్చిన తర్వాత లాక్‌డౌన్‌లు ప్రకటించడం తెలిసిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాతో చైనాలోని విమానాశ్రయలు, ఓడరేవుల్లో కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించాల్సి వచ్చింది. దీంతో చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిభాగాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్‌ పెరగడం వంటి పరిస్థితులు పాత ఫోన్లకు డిమాండ్‌ను తెచ్చిపెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల ల్యాప్‌టాప్‌లు, రూ.10,000–15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. 2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్‌ మొబైల్‌ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్‌ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది.    

మరిన్ని వార్తలు