అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!

19 Apr, 2022 03:47 IST|Sakshi

మార్చిలో 14.55 శాతం అప్‌

నాలుగు నెలల గరిష్టం

క్రూడ్, కమోడిటీల ఎఫెక్ట్‌

ఆర్థిక సంవత్సరం 12 నెలల్లోనూ రెండంకెల పైనే..

న్యూఢిల్లీ: టోకు ధరలు ఆందోళనకరంగా తయారయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 14.55 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోని వస్తువుల ధర 14.55 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.

క్రూడ్, ఇతర కమోడిటీల ధరల తీవ్రత తాజా గణాంకాలపై ప్రతిబింబిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరాల చైన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో అసలే భారంగా ఉన్న టోకు ధరల తీవ్రత మరింత పెరిగింది. 2021 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 7.80 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల్లో   టోకు ధరలు రెండంకెలపైన కొనసాగడం గమనార్హం.  

కొన్ని ముఖ్యాంశాలు...
► ఫిబ్రవరిలో ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం 8.19 శాతం ఉంటే, మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల స్పీడ్‌ కూడా నెలల వారీగా 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చింది. అయితే ఈ స్థాయి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తాయి.  
► మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం 9.84% నుం చి (ఫిబ్రవరి) నుంచి 10.71 శాతానికి ఎగసింది.  
► 20 శాతం వాటా ఉన్న ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం నెల వారీగా 31.50 శాతం నుంచి 34.52 శాతానికి ఎగసింది. ఒక్క క్రూడ్‌ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 55.17 శాతం ఉంటే మార్చిలో 83.56 శాతంగా నమోదయ్యింది.

రేటు పెంపు అవకాశం...
ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగితే, జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను పావుశాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎకోర్యాప్, రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనావేస్తున్నాయి. 

ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా  వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది.  అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు