March18th పసిడి ప్రియులకు షాక్‌: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!

18 Mar, 2023 14:59 IST|Sakshi

సాక్షి,ముంబై:  పసిడి ధర రికార్డు స్థాయికి  చేరుకుని వినియోగదారులకు షాకిస్తోంది. బులియన్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది.  దేశీయంగా గతం వారం రోజుల వ్యవధిలో ధర రూ.3,520కు పైగా పెరిగింది. బంగారం ధర ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అమెరికా  బ్యాంక్ సంక్షోభం పసిడి ధరలకు ఊతమిస్తోంది.

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  60,320 రూపాయలను దాటేసింది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఏకంగా 10 గ్రాములకు రూ. 1500 పెరిగింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. 

హైదరాబాదులో 24 క్యారెట్ల బంగార ధర  10 గ్రాములు రూ. 60,320 వద్ద ఉంది. సుమారు రూ. 1,630 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1300 పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది. 

గ్లోబల్‌గా కూడా అమెరికా మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభంలోనే  శనివారం రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 1,988 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వారం ముగింపుతో పోలిస్తే ఔన్స్‌కు 6.48 శాతం పెరిగింది.  రాబోయే కొద్ది రోజుల్లో ధర 2వేల డాలర్లను కూడా దాటేసి 2,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వెండి కూడా బంగారంతోసమానంగా వారానికి దాదాపు 9.22 శాతం భారీ లాభాలను ఆర్జించింది. ఇదే రేంజ్‌లో దేశీయంగా కూడా ధరలు ప్రభావితం కానున్నాయని  మార్కెట్‌ నిపుణుల అంచనా.  మార్చి 21న జరిగే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ముఖ్యంగా అమెరికా బ్యాంకింక్‌ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు  చర్యలు తీసుకోకపోతే  పసిడి ధరలు మరింత పెరుగుతాయనేది విశ్లేషకులు  భావిస్తున్నారు.

కాగా అమెరికా  చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రాష్  సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనంతో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనకు దారి తీసింది. అటు  క్రెడిట్ సూయిస్ షేర్లలో పతనం ప్రపంచ మార్కెట్ గందరగోళానికి దారితీసింది. దీంతో అంతర్జాతీయంగా శుక్రవారం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు