ఎఫ్‌బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్‌, కష్టాల్లో మెటా

13 Oct, 2022 15:07 IST|Sakshi

న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పౌండర్‌ మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంత ప్లాట్‌ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో జుకర్‌బర్గ్‌కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. 

మరోవైపు జుకర్‌బర్గ్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా  లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్‌బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్‌ చేశారు.  అంతేకాదు తనకు ఫేస్‌బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్‌ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు  తెలిపింది. అయితే, పొరపాటు  ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

కాగా మెటా వర్స్‌ సక్సెస్‌లో ఇబ్బందులు పడుతున్న మోటాకు ‌తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్‌లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ  ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి  తెలిసిందే.  అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్‌ఇన్  సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్‌బర్గ్  రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం  ఇప్పటికే అమల్లో ఉంది. 

మరిన్ని వార్తలు