కన్సాలిడేషన్‌లో- ఆటో, బ్యాంక్స్‌ వీక్‌

21 Dec, 2020 10:08 IST|Sakshi

10 పాయింట్లు ప్లస్‌‌‌‌- 46,971కు సెన్సెక్స్‌

ఇంట్రాడేలో 47,000 పాయింట్లను దాటిన ఇండెక్స్‌

యథాతథంగా 13,760 వద్ద కదులుతున్న నిఫ్టీ

ఆటో,బ్యాంకింగ్‌, మెటల్‌, డౌన్‌‌‌- ఫార్మా, ఐటీ ప్లస్‌

బీఎస్‌ఈలో అటూఇటుగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 10 పాయింట్లు బలపడి 46,971కు చేరింది. నిఫ్టీ యథాతథంగా 13,760 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి కొనసాగుతుండటంతో వారాంతాన యూఎస్‌ మార్కెట్లు 0.4 శాతం వెనకడుగు వేశాయి. దేశీయంగానూ ప్రభావిత అంశాలు కొరవడటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,012 వద్ద గరిష్టాన్నీ, 46,694 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 13,764-13,674 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

రియల్టీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, మీడియా 1-0.5 శాతం మధ్య నీరసించగా.. ఫార్మా, ఐటీ, రియల్టీ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, దివీస్‌, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, హిందాల్కో, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ 2.3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎల్‌అండ్‌టీ‌, సిప్లా, ఆర్ఐఎల్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

ఇండిగో డీలా
డెరివేటివ్స్‌లో ఇండిగో, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, బంధన్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పీవీఆర్‌ 3.5-1.7 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. మరోపక్క గ్లెన్‌మార్క్‌, మ్యాక్స్ ఫైనాన్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, క్యాడిలా హెల్త్‌, లుపిన్‌, ఇండస్‌టవర్‌, అపోలో హాస్పిటల్స్‌ 2.7-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ 0.2 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,159 లాభపడగా.. 1,156నష్టాలతో ట్రేడవుతున్నాయి. 

పెట్టుబడుల బాట
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు