ఆద్యంతం ఆటుపోట్లు- చివరికి ఫ్లాట్‌

29 Sep, 2020 16:02 IST|Sakshi

8 పాయింట్లు డౌన్‌- 37,973కు సెన్సెక్స్

‌5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద ముగిసిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, రియల్టీ నష్టాల్లో 

మెటల్‌ 2 శాతం జూమ్‌- ఆటో, ఐటీ స్వల్ప లాభాల్లో

బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం వీక్

ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. సెన్సెక్స్‌ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,973 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద స్థిరపడింది. అయితే వరుసగా మూడో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 250 పాయింట్లు జంప్‌చేసి 38,236ను తాకగా.. నిఫ్టీ 11,305 వరకూ ఎగసింది. అయితే ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 37,831 వద్ద, నిఫ్టీ  11,181 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చవిచూశాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఫార్మా 2.2-0.7 శాతం మధ్య నీరసించగా.. మెటల్‌ 2 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటో, ఐటీ 0.3 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కొ, అల్ట్రాటెక్‌, హీరో మోటో, టైటన్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 5.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, గ్రాసిమ్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, సిప్లా, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ 3.5-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి.

ఐడియా పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, పేజ్‌, మైండ్‌ట్రీ, ముత్తూట్‌, మదర్‌సన్‌, బాలకృష్ణ, అంబుజా, ఎస్కార్ట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, అపోలో టైర్‌, సీమెన్స్‌ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, భెల్‌, బీవోబీ, ఇన్‌ఫ్రాటెల్‌, పీఎన్‌బీ, జీఎంఆర్‌, మెక్‌డోవెల్‌, ఇండిగో, ఐజీఎల్‌, టాటా కన్జూమర్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పిరమల్‌, హావెల్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,178 లాభపడగా.. 1,436 నష్టాలతో నిలిచాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.    

మరిన్ని వార్తలు