నష్టాల ముగింపు- చిన్న షేర్లు జూమ్‌

27 Nov, 2020 15:56 IST|Sakshi

110 పాయింట్లు మైనస్‌- 44,150కు చేరిన సెన్సెక్స్‌

18 పాయింట్లు క్షీణించి 12,969 వద్ద ముగిసిన నిఫ్టీ

రియల్టీ, ఆటో, మీడియా‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌‌- ఐటీ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2 శాతం అప్‌

ముంబై, సాక్షి: రోజంతా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 110 పాయింట్లు క్షీణించి 44,150 వద్ద నిలివగా.. నిఫ్టీ 18 పాయింట్లు తక్కువగా 12,969 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,995 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,914 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్‌) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజు మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య నీరసంగా ముగిశాయి. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ నెలకొనడం గమనార్హం!

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.7-1.25 శాతం మధ్య బలపడగా.. ఐటీ 0.45 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హీరో మోటో, దివీస్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కొ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 4.3-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎంజీఎల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎంజీఎల్‌ 14 శాతం దూసుకెళ్లగా.. కమిన్స్‌, ఐజీఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, చోళమండలం, కేడిలా హెల్త్‌కేర్‌, ఎక్సైడ్‌, అపోలో టైర్‌, టీవీఎస్‌ మోటార్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 10.4- 5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పెట్రోనెట్‌, పిరమల్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఆర్‌ఈసీ, జిందాల్‌ స్టీల్‌, మారికో, ఇండిగో, కోఫోర్జ్‌, మెక్‌డోవెల్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1032 మాత్రమే నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు