చివరికి నేలచూపులే- ఫార్మా భేష్‌

31 Jul, 2020 15:54 IST|Sakshi

ఒడిదొడుకుల మధ్య కదిలిన మార్కెట్లు

129 పాయింట్లు డౌన్‌ -37,607కు సెన్సెక్స్‌

29 పాయింట్లు క్షీణించి 11,073 వద్ద నిలిచిన నిఫ్టీ

లాభాలతో నిలిచిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు

ఆగస్ట్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 129 పాయింట్లు క్షీణించి 37,607 వద్ద నిలిచింది. నిఫ్టీ 29 పాయింట్లు తక్కువగా 11,073 వద్ద ముగిసింది. అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు అమెజాన్, యాపిల్‌, ఫేస్‌బుక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్స్‌లో ఈ షేర్లన్నీ హైజంప్‌ చేశాయి. అయినప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్యే ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,898 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,432 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,150-11,027 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా 3.6 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ సైతం 0.6 శాతం చొప్పున బలపడటం గమనార్హం. మీడియా మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9 శాతం బలహీనపడగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, సిప్లా, గ్రాసిమ్‌ 5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌ 3-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐషర్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, కొటక్‌ బ్యాంక్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో 3-1.5 శాతం మధ్య క్షీణించడంతో మార్కెట్లు తిరోగమించాయి.

ఫార్మా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో టొరంట్ ఫార్మా, పిరమల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అరబిందో, కేడిలా హెల్త్‌, ఐడియా, బాలకృష్ణ, ఇండిగో, డాబర్‌, లుపిన్‌ 9-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క చోళమండలం, ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌ఎండీసీ, టీవీఎస్‌, మణప్పురం, ఈక్విటాస్‌, ముత్తూట్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, అపోలో హాస్పిటల్స్‌ 5.3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1430 నష్టపోగా.. 1232 లాభపడ్డాయి.

డీఐఐల అమ్మకాలు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 207 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 387 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 353 కోట్లు, డీఐఐలు రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు