మార్కెట్లకు ఎఫ్‌పీఐల దన్ను

24 Oct, 2020 11:01 IST|Sakshi

గత వారం సెన్సెక్స్‌ 703 పాయింట్లు అప్‌

40,686 సమీపంలో నిలిచిన ఇండెక్స్‌

168 పాయింట్లు జమ- 11,930కు చేరిన నిఫ్టీ

ఒక దశలో 12,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నికరంగా సెన్సెక్స్‌ 703 పాయింట్లు జమ చేసుకుని 40,686 వద్ద నిలిచింది. తద్వారా 40,000 మైలురాయిని మళ్లీ అధిగమించింది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 11,930 వద్ద ముగిసింది. వారం చివర్లో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల మార్క్‌ను సైతం దాటేసింది. అంతక్రితం వారం మార్కెట్లు నష్టాలతో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా.. మార్కెట్లకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దన్నుగా నిలుస్తున్నాయి. దీనికితోడు కోవిడ్‌-19 నేపథ్యంలోనూ బ్లూచిప్‌ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ, అటు యూఎస్‌ ప్రభుత్వ ప్యాకేజీలపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం..

ఎఫ్‌పీఐల అండ
గత వారం(19-23) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో దాదాపు రూ. 7,376 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌ చేశారు. ఇదే సమయంలో దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 7,800 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 13,565 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 7,800 కోట్ల పెట్టుబడులను మాత్రమే వెనక్కి తీసుకున్నాయి. గత వారం డాలరుతో మారకంలో రూపాయి 24 పైసలు క్షీణించింది. 73.34 నుంచి 73.60కు నీరసించింది.

రియల్టీ జోరు
గత వారం బీఎస్‌ఈలో రియల్టీ రంగం 9 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, పవర్‌ 5-4 శాతం చొప్పున ఎగశాయి. సెన్సెక్స్‌ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మార్కెట్‌ విలువను అత్యధికంగా పెంచుకోగా.. ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ల మార్కెట్‌ క్యాప్‌ క్షీణించింది. బ్రిటానియా 7.4 శాతం నష్టపోగా.. ఎల్‌అండ్‌టీ 5.3 శాతం జంప్‌చేసింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2.4 శాతం పుంజుకుంది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఒబెరాయ్‌ రియల్టీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, వొడాఫోన్‌ ఐడియా, ఏబీ క్యాపిటల్‌ లాభపడగా.. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ డీలాపడ్డాయి. ఈ బాటలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2.3 శాతం బలపడింది. చిన్న షేర్లలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, సాగర్‌ సిమెం‍ట్స్‌, మ్యాగ్మా ఫిన్‌, పీసీ జ్యవెలర్స్‌, చెన్నై పెట్రో భారీగా ఎగశాయి. అయితే రామ్‌కో సిస్టమ్స్‌, పటేల్‌ ఇంజినీరింగ్‌, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎంఈపీ ఇన్‌ఫ్రా తదితరాలు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు