టీసీఎస్‌ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం

5 Oct, 2020 06:36 IST|Sakshi

కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు 

ట్రంప్‌ ఆరోగ్య స్థితిగతులు

ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలు

ఐటీ కంపెనీ టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయి.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.  

ఈ నెల 7న టీసీఎస్‌ ఫలితాలు....
మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్‌ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు.  

మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు....
విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్‌ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్‌ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు.

మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్‌
సీఈవోలతో సీఐఐ సర్వే
క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్‌ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్‌ఫ్రా, నిర్మాణ తదితర రంగ  సంస్థల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్‌డౌన్‌ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది.  ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్‌ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు