వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్‌

9 Jan, 2021 12:29 IST|Sakshi

క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాలు

జాబితాలో ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌

టీసీఎస్‌ ఫలితాలతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం

2021 తొలి వారం దేశీ స్టాక్‌ మార్కెట్ల రికార్డ్స్

‌2009 తదుపరి 10 వారాలపాటు లాభాల్లోనే

రూ. 196 లక్షల కోట్లకు చేరిన బీఎస్‌ఈ విలువ

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజాలు జోష్‌నిచ్చే వీలుంది. వారాంతాన పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా నంబర్‌ వన్‌ ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో గత వారం(4-8) మార్కెట్లు 2 శాతం ఎగశాయి. వెరసి సెన్సెక్స్‌ 913 పాయింట్లు లాభపడి 48,782 వద్ద నిలవగా.. నిఫ్టీ 329 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. 2009 తదుపరి వరుసగా 10 వారాలపాటు లాభాలతో నిలిచిన రికార్డును సైతం మార్కెట్లు సాధించాయి. గత వారాంతానికి బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారి దాదాపు రూ. 196 లక్షల కోట్లను తాకడం విశేషం! ఇకపై మార్కెట్లు మరింత జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించనుండటంతో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు పేర్కొంటున్నారు. చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్‌)

జాబితా ఇలా
నేడు(9న) డీమార్ట్‌ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇన్ఫోసిస్‌, విప్రో 13న, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 15న పనితీరును వెల్లడించనున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ 7.7 శాతమే క్షీణించనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దాదాపు ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇది కొంతమేర ఆందోళనకర అంశమే అయినప్పటికీ యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టనుండటం, తద్వారా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్‌ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. (యూఎస్‌ మార్కెట్ల సరికొత్త రికార్డ్‌)

ఎఫ్‌పీఐల దన్ను
గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ. 8,758 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లోనూ రికార్డు స్థాయిలో 14 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పంప్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 తొలి వారంలోనూ దేశీ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో అంతరర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్ప కరెక్షన్‌ల నడుమ మార్కెట్లు మరింత వృద్ధి చూపుతున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు