వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?

19 Dec, 2020 14:54 IST|Sakshi

ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం

క్రిస్మస్‌ సందర్భంగా వారాంతాన సెలవు

ఎఫ్‌పీఐల పెట్టుబడులు, వ్యాక్సిన్ల వార్తలే కీలకం

కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో సెంటిమెంటుకు దెబ్బ!

నిఫ్టీకి 13,950 వద్ద రెసిస్టెన్స్‌- 13,570-13,541 వద్ద సపోర్ట్స్‌

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాలో సాగుతున్న మార్కెట్లు సమీప భవిష్యత్‌లో కొంతమేర హెచ్చుతగ్గులకు లోనయ్యే వీలున్నట్లు భావిస్తున్నారు. గత వారం(14-18) మార్కెట్లు దాదాపు 2 శాతం జంప్‌చేయడంతో ఇకపై పరిమిత శ్రేణిలోనే కదలవచ్చని చెబుతున్నారు. గత వారం సెన్సెక్స్‌ 862 పాయింట్లు ఎగసి 46,961 వద్ద ముగిసింది. వారం చివర్లో మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 247 పాయింట్లు జమ చేసుకుని 13,761 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 1.5 శాతం స్థాయిలో బలపడటం గమనార్హం! కాగా.. క్రిస్మస్‌ సందర్భంగా వచ్చే వారాంతాన(25న) మార్కెట్లకు సెలవు. దీంతో వచ్చే వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే(21-24) పరిమితంకానుంది. (బెక్టర్స్‌ ఫుడ్‌ విజయం వెనుక మహిళ)

ప్రభావిత అంశాలు
వచ్చే వారం మార్కెట్లను ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు ప్రభావితం చేయనున్నట్లు స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు నిరవధికంగా పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు పేర్కొన్నారు. వీటికితోడు వ్యాక్సిన్ల వార్తలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. అయితే సెకండ్‌ వేవ్‌లో భాగంగా యూఎస్‌, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు వివరించారు. యూరోపియన్‌ దేశాలలో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో ఆర్థిక రికవరీకి విఘాతం కలగవచ్చని అభిప్రాయపడ్డారు. (ఆంటోనీ వేస్ట్‌ హ్యాండ్లింగ్‌.. ఐపీవోకు రెడీ)

సాంకేతికంగా ఇలా
దేశీ మార్కెట్లలో గత వారం కనిపించిన హుషారు వచ్చే వారంలోనూ కొనసాగవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో వచ్చే వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 13,950 వరకూ బలపడవచ్చని అంచనా వేశారు. అయితే ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. అయితే మార్కెట్లు ఓవర్‌బాట్‌ స్థితికి చేరడంతో కొంతమేర దిద్దుబాటుకు వీలున్నదని వివరించారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 13,570 పాయింట్ల వద్ద, తదుపరి 13,411 స్థాయిలోనూ మద్దతు(సపోర్ట్‌) లభించవచ్చని అభిప్రాయపడ్డారు. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్ల కన్సాలిడేషన్‌కూ వీలున్నదని తెలియజేశారు.

మరిన్ని వార్తలు