ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీపై ఇన్వెస్టర్ల దృష్టి!

24 Oct, 2020 12:20 IST|Sakshi

29న ముగియనున్న అక్టోబర్‌ సిరీస్‌

క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాలు

ఓవర్‌బాట్‌ పొజిషన్లో నిఫ్టీ- నిపుణులు

11,600- 12,050 వద్ద నిఫ్టీకి సపోర్ట్‌- రెసిస్టెన్స్‌

ప్రస్తుతం సైడ్‌వేస్‌ ట్రేడింగ్‌ జోన్‌లో మార్కెట్లు

వచ్చే వారం అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(29న) ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుంది. శుక్రవారం(30) నుంచీ నవంబర్‌ సిరీస్‌ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్‌ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఊపందుకోగా.. ఈ వారం మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు పనితీరు వెల్లడించనున్నాయి. వెరసి.. అటు ఎఫ్‌అండ్‌వో, ఇటు కంపెనీల ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

జాబితా ఇలా
ఈ వారం​క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాలను విడుదల చేయనున్న ప్రధాన కంపెనీల జాబితా చూద్దాం.. కొటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 26న, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ 27న, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హీరో మోటో, ఎల్‌అండ్‌టీ, టైటన్‌ 28న పనితీరు వెల్లడించనున్నాయి. ఇదే విధంగా బీపీసీఎల్‌, మారుతీ సుజుకీ 29న ఫలితాలు ప్రకటించనున్నాయి. 

ఇతర అంశాలూ
ఈ నెల 28 నుంచీ బీహార్‌లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకానుంది. పోలింగ్‌ సరళితోపాటు.. పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌ ప్రభుత్వ ప్యాకేజీ, అధ్యక్ష ఎన్నికలపై అంచనాలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

సాంకేతికంగా
క్యూ2లో సిమెంట్‌ విక్రయాలు, విద్యుత్‌ వినియోగం వంటి అంశాలు ఆర్థిక రికవరీని సూచిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. మార్కెట్లకు ఎఫ్‌పీఐలు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మార్కెట్లు ప్రస్తుతం సైడ్‌వేస్‌ ట్రేడింగ్‌ జోన్‌లోకి ప్రవేశించినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఓవర్‌బాట్‌ పొజిషన్‌కు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఇకపై నిఫ్టీకి 12,050 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకానున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 11,600 స్థాయిలో బలమైన సపోర్ట్‌ లభించే వీలున్నదని తెలియజేశారు. గత వారం స్వల్ప పరిధిలో కదిలిన నిఫ్టీ ఇటీవలి రెసిస్టెన్స్‌కు సమీపంలో నిలిచినట్లు వివరించారు. ప్రస్తుతం ట్రెండ్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అభిప్రాయపడ్డారు. ఇటీవల సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ కౌంటర్లు జోరు చూపడంతో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని భావిస్తున్నారు. అంతేకాకుండా సమీప భవిష్యత్‌లో రంగాలవారీగా ప్రాధాన్యతలు మారే వీలున్నట్లు ఊహిస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా