14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!

26 Dec, 2020 14:34 IST|Sakshi

ఎఫ్‌అండ్‌వో, వ్యాక్సిన్ల వార్తలు కీలకం?

గురువారం డిసెంబర్‌ కాంట్రాక్టుల ముగింపు

యూరోపియన్‌ దేశాలలో లాక్‌డవున్‌ల ఎఫెక్ట్‌

దేశీయంగానూ వ్యాక్సిన్ల వినియోగానికి చాన్స్‌

వచ్చే వారం మార్కెట్ల ట్రెండ్‌పై అంచనాలు

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని చెబుతున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగవచ్చని భావిస్తున్నారు. గత వారం(21-24) సైతం మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూశాయి. క్రిస్మస్‌ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. సోమవారం(21న) కుప్పకూలిన మార్కెట్లు మిగిలిన మూడు రోజులూ బలపడ్డాయి. వెరసి సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు పుంజుకుని 46,974 వద్ద ముగిసింది. వారం చివర్లో మరోసారి 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అయితే నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్లు క్షీణించి 13,749 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 0.5 శాతం స్థాయిలో బలహీనపడటం గమనార్హం! (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్‌)

ప్రభావిత అంశాలు
వచ్చే వారం మార్కెట్లను ప్రధానంగా కోవిడ్‌-19 సంబంధ వార్తలు ప్రభావితం చేసే వీలుంది. ఇటీవల సెకండ్‌వేవ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 కేసులు, ఇదేవిధంగా పలు కంపెనీల వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ అనుమతులు వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇవికాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు నిరవధికంగా పెట్టుబడులకు దిగుతుండటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు పేర్కొన్నారు. 

సాంకేతికంగా ఇలా
ఇటీవల కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో కనిపిస్తున్న హుషారు వచ్చే వారంలోనూ కొనసాగవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆటుపోట్లు తప్పకపోవచ్చని తెలియజేశారు. వచ్చే వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి 13,800 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఈ స్థాయి దాటితే 14,000 పాయింట్ల మార్క్‌కు చేరవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 13,400 పాయింట్ల వద్ద, తదుపరి 13,100 స్థాయిలోనూ మద్దతు(సపోర్ట్‌) లభించవచ్చని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు