మార్కెట్ల పతనం- దివాన్, ఏఆర్‌ఎస్‌ఎస్‌ జోరు

25 Nov, 2020 15:05 IST|Sakshi

648 పాయింట్లు పడిన సెన్సెక్స్‌- 43,875 వద్ద ట్రేడింగ్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు దివాన్‌ హౌసింగ్‌

52 వారాల గరిష్టానికి చేరిన షేరు

10 శాతం దూసుకెళ్లిన ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ బోర్లా పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 648 పాయింట్లు పతనమై 43,875కు చేరింది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎన్‌బీఎఫ్‌సీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి రూ. 210 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్లు ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట‍్రక్చర్‌ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా మేఘాలయ ఎన్‌హెచ్‌-40లో రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. జేఐసీఏ రుణ మద్దతుకింద ఈపీసీ పద్ధతిలో ఈ కాంట్రాక్టు దక్కినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 15.45 వద్ద ఫ్రీజయ్యింది.

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఆర్థిక సమస్యలతో ఎన్‌సీఎల్‌టీకి చేరిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఆస్తుల విక్రయానికి అధిక ధరలో బిడ్స్‌ దాఖలు చేయమని ఆహ్వానించవలసిందిగా రుణదాతలు కోరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దివాళా చట్టానికి లోబడి ఎన్‌సీఎల్‌టీకి చేరిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలిచిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై నేడు రుణదాతల కమిటీ(సీవోసీ) ఓటు వేయనున్నట్లు తెలుస్తో్ంది. కంపెనీలో వాటా కొనుగోలు లేదా కొన్ని ఆస్తుల కొనుగోలుకి అదానీ గ్రూప్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, యూఎస్‌ కంపెనీ ఓక్‌ట్రీ, హాంకాంగ్‌ సంస్థ ఎస్‌సీ లోవీ తదితరాలు 10-70 శాతం అధిక ధరలలో బిడ్స్‌ దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై నేడు సీవోసీ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 24.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

>
మరిన్ని వార్తలు