మళ్లీ నష్టాల బాటలో- చిన్న షేర్లు బేర్‌

22 Sep, 2020 09:46 IST|Sakshi

292 పాయింట్లు డౌన్‌- 37,742 వద్దకు సెన్సెక్స్‌

103 పాయింట్లు పడిన నిఫ్టీ- 11,147 వద్ద ట్రేడింగ్‌

మీడియా, రియల్టీ, బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటో డీలా- ఐటీ ఎదురీత

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 3-4 శాతం మైనస్‌

ముందురోజు వాటిల్లిన భారీ నష్టాల నుంచి బయటపడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 292 పాయింట్లు క్షీణించి 37,742ను తాకగా.. నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 11,147 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,210- 37,701 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,133 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్‌ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, యూరప్‌లో తిరిగి కోవిడ్‌-19 కేసులు పెరగడం వంటి  పలు ప్రతికూలతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. 

ఐటీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఆటో 3-1.5 శాతం మధ్య  క్షీణించగా.. ఐటీ 0.3 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, జీ, బీపీసీఎల్‌, గెయిల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, బజాజ్‌ ఫిన్‌, ఎంఅండ్‌ఎఎ, మారుతీ 5.4-1.7 శాతం మధ్య నష్టపోయాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌ 1.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. 
 
నష్టాలలో..
డెరివేటివ్‌ కౌంటర్లలో కెనరా బ్యాంక్‌, జిందాల్‌ స్టీల్‌, పిరమల్‌, ఐడియా, పీవీఆర్‌, అపోలో టైర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, భెల్, బంధన్‌ బ్యాంక్‌, బాష్‌, మణప్పురం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 7-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ విభాగంలో నిఫ్టీ దిగ్గజాలను మినహాయిస్తే.. లాభపడిన కౌంటర్లు లేకపోగా..బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 3 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం  చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,661 నష్టపోగా.. 206 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా