దలాల్‌ స్ట్రీట్‌లో మెరుపులు : ఎందుకంటే?

1 Feb, 2021 16:11 IST|Sakshi

సాక్షి,ముంబై: కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమమంత్రి నిర్మల సీతారామన్ ఆరోగ్య సంరక్షణకోసం భారీ నిధులతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం దలాల్‌ స్ట్రీట్‌ లాభాలతో కళకళలాడింది. హెల్త్‌కేర్‌ వ్యయానికి నిధుల రెట్టింపు, బీమా మార్కెట్లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను ఎత్తివేసే ప్రణాళికలను రూపొందించడంతో బెంచ్‌మార్క్‌ ఈక్విటీ సూచీలు సోమవారం 5శాతానికి పైగా ఎగిసాయి. ఆరంభం నుంచీ లాభాలతో ఉన్న మార్కెట్లో బడ్జెట్‌ ప్రసంగం మొదలు, ముగిసేదాకా తమ జోష్‌ను కంటిన్యూ చేశాయి. సెన్సెక్స్‌ 2315 పాయింట్లు జంప్‌ ‌ చేయగా, నిఫ్టీ 14250కి ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. (బడ్జెట్‌ 2021 : పడిన పసిడి ధర)

ముఖ్యంగా బాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ ఆల్‌ టైం గరిష్టాన్ని తాకింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఆస్తి పునర్నిర్మాణ సంస్థ ఏర్పాటు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనే చర్యలు, ప్రభుత్వరంగ బ్యాంకుల విభజన, బీమారంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్ వంటి ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని చర్యలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేసాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కోవిడ్ సెస్, క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ వడ్డింపు భయాలు ఉన్నాయని, కానీ వీటిలో ఏదీ బడ్జెట్ 2021 లో కార్యరూపం దాల్చకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. (కేంద్ర బడ్జెట్‌: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట)

మరోవైపు ఇది కార్పొరేట్‌ బడ్జెట్‌, ఎన్నికల బడ్జెట్‌, ప్రజా వ్యతిరేక అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులుంచాలన్న నిపుణుల సూచనలను కేంద్రం అసలు పట్టించుకోలేని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  విమర్శించారు. ప్రజల చేతుల్లో నగదు పెట్టడం మర్చిపోయిన మోడీ ప్రభుత్వం భారత ఆస్తులను క్రోనీ కాపిటలిస్టులకు కట్టబెడుతోందని ఆయన ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు