భారీ అవినీతి ఆరోపణలు: పెదవి విప్పిన మారుతీ ఛైర్మన్

23 Jan, 2023 17:26 IST|Sakshi

సాక్షి,ముంబై: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీలోని ఎగ్జిక్యూటివ్స్‌పై వచ్చిన  అవినీతి ఆరోపణలపై తొలిసారి స్పందించారు సంస్థ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ. ఈ ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు విచారణకు  ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు.  కంపెనీ పాలసీ ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వెండర్స్‌కు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు అధిక ధరకు విడి భాగాలను కొందరు ఎగ్జిక్యూటివ్స్ సరఫరా చేసి వ్యక్తిగత లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు మారుతీ సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ ఛైర్మన్ హెచ్చరించారు.

పర్చేజ్ డిపార్టమెంట్ లో కొందరు కీలక అధికారులు అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను KPMGకు అప్పగించినట్లు  వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌కు ఇప్పటికే పంపినట్లు చెప్పారు మారుతీ సుజుకీ ఛైర్మన్.

కాగా దేశంలోని తయారీ ప్లాంట్లకు అవసరమైన 95 శాతం ముడిసరుకు సప్లయిర్ల నుంచే కొనుగోలు చేస్తుంది మారుతి సుజుకీ. 84 శాతం సప్లయిర్లు.. తయారీ ప్లాంట్లకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు