Maruti Jimny: 5 డోర్స్ జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు

21 May, 2023 20:01 IST|Sakshi

Maruti Jimny: మారుతి సుజుకి తన జిమ్నీ SUVని ఎప్పుడెప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ ఈ కారుని వచ్చే నెలలో విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కానీ అంత కంటే ముందు ఈ కారు మైలేజ్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించిన 5 డోర్స్ జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఈ ఆఫ్ రోడర్ 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. 

మైలేజ్ వివరాలు
మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. 

డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎస్‌యువి వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మాన్యువల్ వేరియంట్‌ల కోసం ఆరు నెలల, ఆటోమేటిక్ వేరియంట్‌ల కోసం ఎనిమిది నెలల వరకు ఉంటుంది. కాగా సంస్థ ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్‌లోని తన ప్లాంట్ నుంచి 5 డోర్స్ జిమ్నీ విడుదల చేసింది. కావున ధరలు కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

అంచనా ధర & ప్రత్యర్థులు
మారుతి సుజుకి జిమ్నీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలవుతుందని అంచనా. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. 

మరిన్ని వార్తలు