విడుదలకు ముందే డీలర్ యార్డ్‌లో కనిపించిన మారుతి జిమ్నీ - పూర్తి వివరాలు

2 Apr, 2023 14:49 IST|Sakshi

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో కొత్త జిమ్నీ ఎస్‌యువిని విడుదల చేయడానికి  సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఆఫ్ రోడర్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాకముందే ఇటీవల డీలర్ యార్డ్‌లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న జిమ్నీ 3-డోర్స్ ఎడిషన్, ఇండియన్ మార్కెట్లో 5-డోర్స్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. ఈ SUV ఆటో ఎక్స్‌పో 2023లో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. అదే సమయంలో కంపెనీ ఈ కారు కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

డీలర్ యార్డ్‌లో కొత్త మారుతి జిమ్నీ, స్విఫ్ట్ పక్కన పార్క్ చేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 18,000  బుకింగ్స్ పొందిన ఈ కారు నెక్సా షోరూమ్‌లలో కస్టమర్ల సందర్శనార్థం ప్రదర్శించారు. డెలివరీలు ఈ నెల చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..)

డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. దీని పొడవు 3,985 మిమీ, 1,720 వెడల్పు, వీల్‌బేస్ 2,590 మిమీ వరకు ఉంటుంది. కావున ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

త్వరలో విడుదలకానున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.

(ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?)

జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 9.99 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్‌యువి డెలివరీలను వేగవంతం చేయడానికి సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

>
మరిన్ని వార్తలు