భారత్‌లో వన్‌ అండ్‌ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!

19 Nov, 2022 08:26 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్‌లెట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్‌యూవీలను పరిచయం చేస్తాం. ఎస్‌యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్‌ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్‌ కార్లకు ఆదరణ పెరుగుతుంది.

చార్జింగ్‌ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్‌ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు.

మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్‌ మోటార్స్‌ ఎండీ వరుణ్‌ దేవ్‌ వెల్లడించారు. భారత్‌లో ఇంత విస్తృత నెట్‌వర్క్‌ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది.

చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు

మరిన్ని వార్తలు