భారత్‌లో ఎట్టకేలకు మారుతి బ్రెజ్జా సిఎన్‌జి విడుదల - ధర ఎంతో తెలుసా?

18 Mar, 2023 08:21 IST|Sakshi

సిఎన్‌జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్‌జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

బుకింగ్స్ & ధరలు:

మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ.

వేరియంట్స్:

మారుతి బ్రెజ్జా సిఎన్‌జి మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డిజైన్ & ఫీచర్స్:

బ్రెజ్జా సిఎన్‌జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్‌లో సిఎన్‌జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి.

(ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు)

పవర్‌ట్రెయిన్:

కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్‌జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 101 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

(ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!)

ప్రత్యర్థులు:

మారుతి సిఎన్‌జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా.

మరిన్ని వార్తలు