ప్రైవేట్‌పై నమ్మకమే అభివృద్ధికి దన్ను

29 Aug, 2022 05:45 IST|Sakshi

మారుతీ సుజుకీ చైర్మన్‌ భార్గవ వెల్లడి

గాంధీనగర్‌: దేశ పురోగతి, అభివృద్ధి సాధనలో ప్రైవేట్‌ రంగంపై నమ్మకం ఉంచడం కీలకమని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్‌ రంగాన్ని విశ్వసించిందని, దేశ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి.. ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో ఉండేలా పరిశ్రమను ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. అలాగని ప్రైవేట్‌ రంగంలో లోపాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ .. ప్రైవేట్‌ రంగాల సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని చూస్తే ప్రైవేట్‌ వైపే సానుకూలాంశాల మొగ్గు కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

‘ఈ 60–65 ఏళ్లు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను చూసిన మీదట .. భవిష్యత్తులో ప్రైవేట్‌ రంగంపై ఆధారపడటం ద్వారా భారత్‌ ముందుకు వెళ్లగలదు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు‘ అని భార్గవ చెప్పారు.    మారుతీ సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాబోయే 10–20 ఏళ్లలో దేశీయంగా ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై స్పందిస్తూ భార్గవ ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అంత సమర్ధమంతంగా లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిమితులు, లీగల్‌ విధానాలు, అలాగే నియంత్రణలు.. పర్యవేక్షణ మొదలైన అంశాలు కారణమని పేర్కొన్నారు.  

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు భార్గవ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, దివాలా కోడ్, జీఎస్‌టీ అమలు, కార్పొరేట్‌ ట్యాక్స్‌లను తగ్గించడం మొదలైన సంస్కరణలు ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ‘కొన్నేళ్ల క్రితం దేశీయంగా పారిశ్రామిక వృద్ధిపై నేను నిరాశావాదంతో ఉన్నాం. బోలెడన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏదీ జరిగేది కాదు. కానీ ఒక్కసారిగా సంస్కరణల రాకతో భారత్‌ మారుతోందని నాకు తోచింది. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని అనిపించింది‘ అని భార్గవ తెలిపారు.

ఈసారి అత్యధిక ఉత్పత్తి..
సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ రికార్డులు నమోదు చేయగలదని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ‘భారత్‌లోను, కార్ల పరిశ్రమలోను 2022–23లో ఉత్పత్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. నేను కేవలం మారుతీ గురించి మాట్లాడటం లేదు. మొత్తం కార్ల పరిశ్రమ గురించి చెబుతున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. 2018–19లో దేశీయంగా రికార్డు స్థాయిలో 33,77,436 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 30,69,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు