India's Most Fuel Efficient Car: ఇంధన ధరల నుంచి కాస్త ఊరట..! అత్యధిక మైలేజ్‌ ఇచ్చే కారును లాంచ్‌ చేసిన మారుతి సుజుకీ..!

8 Mar, 2022 19:43 IST|Sakshi

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకి భారత మార్కెట్లలోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది భారత్‌లో మోస్ట్‌ ఫ్యూయల్‌ ఎఫిసియంట్‌ కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. 

న్యూ డిజైర్‌ ఎస్‌-సీఎన్‌జీ
గ్రీన్‌ మొబిలిటే లక్ష్యంగా మారుతి సుజుకీ పలు మోడళ్లను సీఎన్‌జీ వేరియంట్‌గా మారుస్తోంది. ఈ మోడల్‌తో మొత్తంగా 9 మోడల్‌ కార్లను సీఎన్‌జీ టెక్నాలజీతో జతచేసింది. మారుతి సుజుకీ  న్యూ డిజైర్‌ ఎస్‌- సీఎన్‌జీ వేరియంట్‌ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హై-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ రూ. 8.82 లక్షల వద్ద లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కొనుగోలుదారులు డీలర్ల వద్ద రూ. 11,000 అడ్వాన్స్ రూపంలో చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

దేశీయంగా సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వరుసగా సీఎన్‌జీ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డిజైర్ మోడల్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో, ఎర్టిగా మోడళ్లను సీఎన్‌జీ వేరియంట్‌లో విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు డిజైర్‌ను కూడా తీసుకొచ్చింది

ఇంజన్‌ విషయానికి వస్తే..!
ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ మోస్ట్‌ ఫ్యూయల్‌  ఎఫిసియంట్‌ కారుగా న్యూ డిజైర్‌ ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్‌ను కొనుగోలుదారులకు మారుతి సుజుకీ అందుబాటులోకి తెచ్చింది. కొత్త డిజైర్ ఎస్‌-సీఎన్‌జీ సాంకేతికతతో, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT 1.2L ఇంజన్‌ జతచేశారు. ఇది 57kW గరిష్ట శక్తిని, 98.5Nm గరిష్ట టార్క్‌ను అందించనుంది. ఈ కొత్త డిజైర్ ఒక కేజీకి 31.12 కిమీ మేర మైలేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్స్‌లో సరికొత్తగా..
ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

చదవండి: క్రేజీ ఆఫర్‌..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!

మరిన్ని వార్తలు