విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..

17 Mar, 2023 10:55 IST|Sakshi

భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా కీర్తి గడించిన మారుతి సుజుకి రానున్న నాలుగు నెలల్లో మరో మూడు కొత్త కార్లను విడుదల చేయనుంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ 5-డోర్, బ్రెజ్జా CNG ఉన్నాయి. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్:
2023 ఆటో ఎక్స్‌పోలో ఎంతోమంది మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది మారుతి నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 'సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా' అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. అంతే కాకుండా ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ (బూస్టర్‌జెట్ ఇంజిన్), 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్:
దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ ఎస్‌యువికి ప్రధాన ప్రత్యర్థిగా రానున్న మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటికే డీలర్‌షిప్‌కి చేరుకోవడం కూడా ప్రారంభించింది. ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ ఆఫ్-రోడర్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

కంపెనీ ఈ ఎస్‌యువి కోసం 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఇది K15B పెట్రోల్ ఇంజన్‌ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా CNG:
మారుతి సుజుకి సిఎన్‌జి విభాగాన్ని విస్తరించడంతో భాగంగా తన బ్రెజ్జా సిఎన్‌జి విడుదల చేయనుంది. కంపెనీ ఈ మోడల్ కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది.

మారుతి బ్రెజ్జా సిఎన్‌జి ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగానే అదే 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

>
మరిన్ని వార్తలు