వాహన విక్రయాలు.. టాప్‌గేర్‌!

2 Apr, 2021 06:24 IST|Sakshi

మార్చిలో భారీగా పెరుగుదల

మారుతీ అమ్మకాలు 94% అప్‌

న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడంతో ఆటో కంపెనీలు మార్చిలో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌లు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. అలాగే టయోటా కిర్లోస్కర్‌ మోటార్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హోండా కార్స్‌ అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ మార్చిలో మొత్తం 1.49 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 76,976 యూనిట్లతో పోలిస్తే ఇది 94 శాతం అధికం.

ఇదే దేశీయ అమ్మకాలు ఆర్థిక సంవత్సరం 2019–20లో 14,36,124 యూనిట్లుగా నమోదుకాగా, ఆర్థిక సంవత్సరం 2020–21లో 13,23,396 యూనిట్లుకు పరిమితం అయ్యాయి. ‘‘కోవిడ్‌ సంబంధిత అంతరాలతో గతేడాది మార్చి విక్రయాల్లో 47 శాతం క్షీణత నమోదైంది. ఈ 2021 ఏడాది మార్చిలో నమోదైన విక్రయాల వృద్ధి (48 శాతం)తో పోలిస్తే రికవరీని సాధించినట్లు అవగతమవుతోంది’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే నెలలో దేశీయ వాహన విక్రయాల్లో 100 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుందాయ్‌   ప్రకటించింది. గతేడాది మార్చిలో 26,300 యూనిట్లను విక్రయించగా, ఈసారి అమ్మకాలు 52,600 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.

టాటా మోటార్స్‌  ప్యాసింజర్‌ విభాగంలో మొత్తం 29,654 యూనిట్లను విక్రయించి 422% వృద్ధిని సాధించింది.  ఇదే మార్చిలో టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ 15,001 వాహనాలను విక్రయించింది. గతేడాది మార్చిలో అమ్మకాలు 7,023 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా మార్చిలో మొత్తం 16,700 ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 3,383 యూనిట్లుగా ఉన్నాయి.  బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ300, ఆల్‌–న్యూ థార్‌ వంటి మోడళ్లు ఆశించిన స్థాయిలో అమ్ముడయ్యాయని కంపెనీ ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో విజయ్‌ నక్రా తెలిపారు. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ ఏడాది మార్చి విక్రయాలు ఇంతలా పెరగడానికి బేస్‌ ఎఫెక్ట్‌  కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు