నెక్సా కస్టమర్లు 20 లక్షలు

25 Mar, 2023 05:18 IST|Sakshi

ఏడాదిలో రెండవ స్థానం లక్ష్యం

హ్యుండై, టాటాను దాటతాం

మారుతీ సుజుకీ శశాంక్‌ శ్రీవాస్తవ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నెక్సా రిటైల్‌ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్‌ఎల్‌6, గ్రాండ్‌ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్‌లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్‌ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.  

రెండవ స్థానం దిశగా..
తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్‌ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్‌ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్‌ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్‌లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్‌ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు.  

పరిశ్రమ కంటే మెరుగ్గా..
2023–24లో ప్యాసింజర్‌ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్‌ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్‌పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు