అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వ్యాగన్-ఆర్!

17 May, 2023 07:30 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా హ్యాచ్‌బ్యాక్‌ వేగన్‌–ఆర్‌ 30 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు నమోదు చేసింది. 1999లో ఈ మోడల్‌ భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. 2008లో 5 లక్షల యూనిట్లు, 2012 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది. ఆ తర్వాత  అయిదేళ్లలోనే అమ్మకాలు రెండింతలయ్యాయి. 

2021 నాటికి మొత్తం 25 లక్షల కార్లు రోడ్డెక్కాయి. ప్రస్తుతం థర్డ్‌ జనరేషన్‌ వేగన్‌–ఆర్‌ మార్కెట్లో ఉంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.5.54–7.42 లక్షల మధ్య పలుకుతోంది. కె–సిరీస్, డ్యూయల్‌ జెట్, డ్యూయల్‌ వీవీటీ 1.0, 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మాన్యువల్, ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. సీఎన్‌జీ వేరియంట్‌ కూడా ఉంది. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, హిల్‌ హోల్డ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

వేగన్‌–ఆర్‌ కస్టమర్లలో 24 శాతం మంది ఇదే మోడల్‌కు అప్‌గ్రేడ్‌ అవుతున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 2021–22లో 1,89,000 యూనిట్లు, 2022–23లో 2,12,000 యూనిట్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా వేగన్‌–ఆర్‌ స్థానం దక్కించుకుంది.    

మరిన్ని వార్తలు