Mass Layoffs "ఓన్లీ ప్యాకేజ్, నో బ్యాగేజీ" ఉద్యోగ కోతలపై మామూలు చురకలు కాదు! వైరల్‌ వీడియో

31 Jan, 2023 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ:  మేజర్‌  ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతపై  విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  ముఖ్యంగా గూగుల్‌; మెటా, అమెజాన్‌ ట్విటర్‌, మెటా కంపెనీల్లో ఇటీవలి కాలంలో వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు.  దీంతో  ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులు  ఆయా కంపెనీల్లో తమ సుదీర్ఘ జర్నీని, ఉన్నట్టుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వైనంపై  తమ బాధాకరమైన అనుభవాల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

టెక్ పరిశ్రమలో  భారీ తొలగింపులపై అభిప్రాయాన్ని తెలియజేస్తూ,సోషల్ మీడియాలో తాజాగా కమెడియన్‌, యూట్యూబర్‌ శ్రద్ధా జైన్ (అయ్యో శ్రద్ధ) ఒక హిల్లేరియస్‌ వీడియోను  షేర్‌ చేశారు. భారీ లాభాలను ఆర్జించినప్పటికీ టెకీలను తొలగించడంపై ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు.  లైడ్‌ ఆఫ్‌టెకీ పేరుతో షేర్‌ చేసిన  ఈ వీడియో ఇంటర్నెట్‌ను తెగ షేర్‌ అవుతోంది.

లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ సామూహిక తొలగింపులపై టెక్ కంపెనీలపై ఆమె వ్యంగ్య  హాస్య దోరణిలో ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడిన ప్రతీ మాటా ఒక తూటా. కంపెనీ ఆఫ్‌సైట్‌లో, ఒక ఏడాదిలో కంపెనీ లాభాలను మూడు రెట్లు పెంచాం. ఏమి జరిగింది? ఒక నెల తరువాత ఏమైంది? మమ్మల్ని ఎవరు దోచుకున్నారు?" ఆమె ఒక టెకీగా ప్రశ్నించారు. కంపెనీ ఉద్యోగం లేదు కానీ, కంపెనీ ఇచ్చిన టీ-షర్ట్, బ్యాగ్, వాటర్ బాటిల్, పెన్, నోట్‌బుక్, క్యాప్, కాఫీ మగ్, మాస్క్, వీకెండ్స్‌..ఇలా ప్రతీదీ పాత కంపెనీని గుర్తుచేస్తూ ఉంటుందన్నారు. ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటూనే ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారని పరోక్షంగా విమర్శించారు. చివరగా బ్యాగేజీ కాదు, ప్యాకేజీ కావాలంటూ చణుకులు విసిరారు. "ఈ కంపెనీని ఇప్పుడు మర్చిపోవడం కంటే నా మాజీని మర్చిపోవడం చాలా సులభం," "తదుపరి ఉద్యోగం ఏదైనా ఓన్లీ ప్యాకేజీ  అంటూ కంపెనీలకు చురకలేశారు.

దీంతో ప్రస్తుత ట్రెండ్‌పై సరైన అవగాహనతో వీడియో చేశారంటూ అందరూ ప్రశంసించారు."ట్రూత్ టు ది పవర్ ఇన్ఫినిటీ" అంటూ  యూజర్‌, దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన, సృజనాత్మక ,అసలైన  కమెడియన్‌ అంటూ మరొకరు ప్రశసించారు. ముఖ్యంగా వ్యాపారవేత్త,  RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను  ఈ వీడియో ఆకట్టుకుంది. ట్విటర్‌లో దీన్ని షేర్‌ చేయడం విశేషం.  7 లక్షలకు పైగా  వ్యూస్‌, ట్విటర్‌ 183,000 వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు