ఐటీకి కలిసొచ్చిన ‘కరోనా’!

19 Aug, 2020 04:07 IST|Sakshi

కంపెనీల ఆన్‌లైన్‌ బాట..

కరోనా దెబ్బతో డిజిటల్‌ వైపు చూపు

దేశీ ఐటీ సంస్థలకు భారీగా ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో కంపెనీల వ్యూహాలు గణనీయంగా మారిపోతున్నాయి. చాలా మటుకు సంస్థలు డిజిటల్‌ మాధ్యమం వైపు మళ్లడం లేదా ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న పక్షంలో ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ స్వరూపాన్ని వేగంగా మార్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, జెన్‌ప్యాక్ట్, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ కంపెనీ భారీగా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్టులు దక్కించుకుంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్‌ మహమ్మారి అందరిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులను, ఉత్పత్తుల విక్రయాలకు తక్షణం ఆన్‌లైన్‌ బాట పట్టాల్సిన అవసరాన్ని గుర్తించాయని విశ్లేషకులు తెలిపారు.  

వేగంగా వ్యూహాల అమలు.. 
ప్రస్తుత వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేసే దిశగా ఇన్ఫోసిస్‌కు అమెరికాలో రెండు భారీ డీల్స్‌ దక్కాయి. వీటిలో ఒకటి ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వాన్‌గార్డ్‌ది కాగా మరొకటి ఇంధన రంగ దిగ్గజం కాన్‌ ఎడిసన్‌ది. కరోనా సంక్షోభం కారణంగా చాలా మటుకు క్లయింట్లు డిజిటల్‌ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలనుకుంటున్నారని ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ ఇటీవల తెలిపారు. భారీ స్థాయిలో డిజిటల్‌ రూపాంతరం చెందేందుకు వాన్‌గార్డ్‌ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇలాంటి ధోరణులకు నిదర్శనమని ఆయన చెప్పారు. అయిదేళ్ల పాటు జరగాల్సిన కొన్ని ప్రాజెక్టుల కాలవ్యవధిని కొంతమంది క్లయింట్లు ఏకంగా 18 నెలలకు కుదించేసుకున్నారని జెన్‌ప్యాక్ట్‌ వర్గాలు వివరించాయి. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించి గత కొద్ది నెలలుగా ప్రస్తుత, కొత్త  క్లయింట్లతో చర్చలు గణనీయ స్థాయిలో జరుగుతున్నాయని పేర్కొన్నాయి. 

వ్యయ నియంత్రణ చర్యలు.. 
వచ్చే రెండు నుంచి నాలుగు క్వార్టర్ల పాటు వ్యాపార సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపైనా, డిజిటల్‌కు మారడంపైనా దృష్టి పెడతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తదనుగుణంగానే ఐటీ బడ్జెట్‌లు కూడా ఉంటాయని తెలిపారు. దీంతో ఐటీ కంపెనీలకు భారీగా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డీల్స్‌ దక్కుతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ ఎవరెస్ట్‌ గ్రూప్‌ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కారణాల కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్‌ ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలన్నదే వ్యాపార సంస్థల లక్ష్యంగా ఉంటోందని పేర్కొన్నాయి.

గత మూడు, నాలుగు నెలలుగా చూస్తే జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతరత్రా టెక్‌ సర్వీసుల కంపెనీల క్లయింట్లలో ఎక్కువగా కన్జూమర్‌ గూడ్స్‌ తదితర రంగాల సంస్థలు త్వరితగతిన డిజిటల్‌ వైపు మళ్లేందుకు సేవల కోసం డీల్స్‌ కుదుర్చుకున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు 500 మిలియన్‌ డాలర్ల పైచిలుకు విలువ చేసే పలు ఒప్పందాలతో దూసుకెడుతున్నాయి. ఇప్పటిదాకా డిజిటలీకరణపై తగిన స్థాయిలో ఇన్వెస్ట్‌ చేయని సంస్థలు ప్రస్తుతం దాని ప్రాధాన్యతను గుర్తించి, ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు