మ్యాక్స్‌ ఫైనాన్స్‌- ఇండియామార్ట్‌.. రయ్‌రయ్‌

25 Aug, 2020 13:42 IST|Sakshi

యాక్సిస్‌ బ్యాంక్‌తో డీల్‌లో సవరణలు

52 వారాల గరిష్టానికి మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌

క్యూ1 ఫలితాలు, మార్జిన్ల దన్ను

సరికొత్త గరిష్టానికి ఇండియామార్ట్‌ షేరు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌తో కుదుర్చుకున్న వాటా కొనుగోలు ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు వెల్లడించడంతో మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈకామర్స్‌ కంపెనీ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
అనుబంధ సంస్థ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా కొనుగోలుకి కుదుర్చుకున్న  ఒప్పందంలో యాక్సిస్‌ బ్యాంక్‌ సవరణలు చేపట్టినట్లు మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజాగా వెల్లడించింది. వెరసి తొలుత ప్రకటించిన 29 శాతంకాకుండా  17 శాతం వాటాను మాత్రమే యాక్సిస్‌ సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ వ్యక్తం చేసిన అభ్యంతరాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ఫైనాన్షియల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 13.5 శాతం దూసుకెళ్లింది. రూ. 623 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 631ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం!

ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్
గతేడాది జులైలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక జోరు చూపుతూ వస్తున్న ఈకామర్స్‌ కంపెనీ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు తొలుత 10 శాతం దూసుకెళ్లి రూ. 3,870ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5 శాతం లాభపడి రూ. 3,690 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 129 శాతం జంప్‌చేసి రూ. 74 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 187 కోట్లను తాకింది. కాగా.. కోవిడ్‌-19 సవాళ్లలోనూ ఇండియామార్ట్‌ మార్జిన్లను పెంచుకున్నట్లు గత వారం బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఈ షేరుకి బయ్‌ రేటింగ్‌ను సైతం ప్రకటించింది. గత రెండు నెలల్లో ఈ షేరు 62 శాం ర్యాలీ చేయడం గమనార్హం!

>
మరిన్ని వార్తలు