అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్‌ జట్టు

1 Nov, 2021 06:30 IST|Sakshi

జేవీ ఏర్పాటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్‌ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్‌ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్‌ డాక్టర్‌ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్‌ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్‌ బాబు చిలుకూరితో కలిసి శరత్‌ మ్యాక్సివిజన్‌ ఐ హాస్పిటల్స్‌ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్‌ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్‌ వ్యవస్థాపక మెంటార్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్‌ బాబు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు