వందే భారత్‌ రైళ్ల తయారీకై మేధా సర్వో బిడ్‌

25 Feb, 2023 07:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అల్యూమినియం బాడీతో 100 వందే భారత్‌ రైళ్ల తయారీకై హైదరాబాద్‌ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్‌ బిడ్‌ దాఖలు చేసింది. స్విస్‌ కంపెనీ స్టాడ్లర్‌తో కలిసి ఈ కంపెనీ బిడ్‌ సమర్పించింది. 

అలాగే ఫ్రెంచ్‌ సంస్థ ఆల్‌స్టమ్‌ సైతం పోటీపడుతోంది. కాంట్రాక్టు విలువ రూ.30,000 కోట్లు. 100 రైళ్ల తయారీతోపాటు 35 ఏళ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. రైళ్ల డెలివరీ కాగానే రూ.13,000 కోట్లు, మిగిలిన మొత్తం 35 ఏళ్ల తర్వాత అందుకుంటాయి. 

గురువారం ఇరు సంస్థలు సమర్పించిన టెక్నికల్‌ బిడ్స్‌ను మూల్యాంకనం చేసి విజేతను నిర్ణయించేందుకు ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను కోరతారు. 2024 తొలి త్రైమాసికంలో స్లీపర్‌ క్లాస్‌తో కూడిన వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేస్‌ లక్ష్యంగా చేసుకుంది. 

ఇప్పటి వరకు 102 రైళ్ల తయారీ కోసం అప్పగించిన కాంట్రాక్టులు అన్నీ కూడా చైర్‌ కార్‌ వర్షన్‌ కావడం గమనార్హం. ప్రస్తుతం 10 రైళ్లు పరుగెడుతున్నాయి. 200 స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లకై గతేడాది బిడ్లు దాఖలయ్యాయి.    

మరిన్ని వార్తలు