మెడికవర్‌ మరిన్ని ఆసుపత్రులు 

7 Dec, 2021 05:29 IST|Sakshi

మూడేళ్లలో మరో 3,000 పడకలు 

కొత్తగా 5,000 మందికి ఉద్యోగాలు 

సంస్థ సీఎండీ అనిల్‌ కృష్ణా రెడ్డి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. 20 నెలల్లో 2,000 పడకలను జోడించి మొత్తం సామర్థ్యం 4,500లకు చేర్చింది. ఇప్పుడు అంతే వేగంగా 2024 నాటికి 7,500 బెడ్ల స్థాయికి చేరేందుకు ప్రణాళిక రచించినట్టు మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సీఎండీ అనిల్‌ కృష్ణా రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం సంస్థలో వైద్యులు, నర్సింగ్, ఇతర విభాగాల్లో కలిపి 10,400 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో మరో 5,000 మందికి కొత్తగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనింకా ఏమన్నారంటే.. 

మెట్రో నగరాలు లక్ష్యంగా.. 
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ,  మహారాష్ట్రలో ఔరంగాబాద్, నాసిక్, సంగమనేర్‌లో ఆసుపత్రులు నెలకొన్నాయి. వీటిలో మల్టీ స్పెషాలిటీతోపాటు క్యాన్సర్‌ కేర్, పిల్లలు, స్త్రీల వైద్యం కోసం ప్రత్యేక కేంద్రాలూ ఉన్నాయి. మూడేళ్లలో కొత్తగా హైదరాబాద్‌తోపాటు వరంగల్, మహారాష్ట్రలో ముంబై, పుణే, కొల్హాపూర్, నాసిక్‌లో హాస్పిటల్స్‌ జతకూడనున్నాయి.

హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులో విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తాం. కొన్ని కేంద్రాలు లాభాల్లో, మిగిలినవి లాభనష్టాలు లేని స్థితికి చేరుకున్నాయి. సంస్థలో ప్రధాన వాటాదారు అయిన మెడికవర్‌ అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాం.  

ఇతర విభాగాల్లోకి ఎంట్రీ.. 
ఔషధాల ఉత్పత్తి, విక్రయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాం. డయాగ్నోస్టిక్స్‌ సేవలనూ పరిచయం చేస్తాం.  ఇప్పటి వరకు సంస్థ రూ.1,450 కోట్లు వెచ్చించింది. మూడేళ్లలో కొత్త కేంద్రాలకు రూ.1,000 కోట్లు వ్యయం కానుంది. క్యాన్సర్‌ కేర్, పిల్లలు, స్త్రీల కోసం స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నాలుగైదు రానున్నాయి.

ఇందుకు మరో రూ.300 కోట్లు వ్యయం ఉంటుంది. 50 శాతం రుణం, మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరులు, వాటా విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరిస్తాం. సంస్థలో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు 60 శాతం వాటా ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2025లో ఐపీవోకు రావాలన్నది ఆలోచన.   

మరిన్ని వార్తలు