వ్యాక్సిన్‌ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..

7 Sep, 2021 15:53 IST|Sakshi

Medicine From The Sky Project: కరోనా వ్యాక్సిన్‌ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృ‍ష్టించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. 

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా
రోజుల లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా అందులో సగానికి పైగా నగర, పట్టణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు. 


గంట వ్యవధిలో
జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా  మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్‌ పాయింట్‌ నుంచి ఎండ్‌ పాయింట్‌కి కేవలం గంట వ్యవధిలో చేరాలా చూస్తారు.  దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. 
సెప్టెంబరు 9 నుంచి 
మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్‌ రన్‌ని 2021 సెప్టెంబరు 9 నుంచి ప్రారంభించనున్నారు. తక్కువ ఎత్తులో కంటికి కనిపించేలా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లను ఎంపిక చేసిన గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలోగా చేరేలా చూస్తారు. ఆ తర్వాత మూడు సార్లు కంటికి కనిపించనంత ఎత్తులో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను గమ్య స్థానాలకు చేరుస్తారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. ఈ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయితే మెడిసన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. 


తొలుత వికారాబాద్ 
మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు చేపట్టేందుకు హైదారాబాద్‌కి సమీపంలో ఉన్న వికారాబాద్‌ జిల్లాను ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్‌ రన్‌లో లోటు పాట​‍్లు గుర్తించి వాటిని సవరించుకుంటారు.
కేంద్రం అనుమతి
డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది కేంద్ర ఏవియేషన్‌ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు