ఐపీవోలకు మరో మూడు కంపెనీలు రెడీ...!

18 Aug, 2021 09:29 IST|Sakshi

మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ 

స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ 

రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ 

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు 

న్యూఢిల్లీ: ఓవైపు దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతూ బుల్‌ జోరు చూపుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్‌ సైతం పలు ఇష్యూలతో సందడి చేస్తోంది. గత వారం రోజుల్లో ఆరు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా.. ప్రస్తుతం మరో మూడు కంపెనీలు ఇదే బాట పట్టాయి. ఇక ఇటీవలే ఐపీవోలు ముగించుకున్న నాలుగు కంపెనీలు సోమవారం(16న) స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా సెబీ తలుపు తడుతున్న కంపెనీల జాబితాలో మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్, స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్, రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీ చేరాయి. వివరాలు చూద్దాం..  (చదవండి: ఐమాక్స్‌ వీడియో రికార్డింగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం...!)

మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ 
ఫార్మసీ రిటైల్‌ చైన్‌.. మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,639 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు,  కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వాటాదారులు మరో రూ. 1,039 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ఫ్యురో ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ. 450 కోట్లు, పీఐ అపార్చునిటీస్‌ ఫండ్‌–1 రూ. 500 కోట్లు చొప్పున వాటాలను ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీతో లభించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టవల్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. 

స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ 
అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్‌ కంపెనీ స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు అనుమతించవలసిందిగా సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా ఉద్యోగులకు సైతం షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను ప్రత్యేకించిన కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఐపీవోకు ముందు షేర్ల జారీ ద్వారా రూ. 220 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో విద్యుత్‌ పంపిణీ మౌలికసదుపాయాల కంపెనీ పేర్కొంది.  


రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీ 
ప్రయాణాలు, ఆతిథ్య రంగ టెక్సాలసీ సర్వీసులందించే రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వాటాదారులు మరో 2.26 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా వ్యాగ్నర్‌ లిమిటెడ్‌ 1.71 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఈక్విటీ జారీతో లభించే నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనుంది.  (చదవండి: ఆపిల్‌ కంపెనీకి భారీ షాక్‌..!)

మరిన్ని వార్తలు