Meesho: ఉద్యోగులకు బంపరాఫర్‌,ఫుల్‌ శాలరీ ఇస్తాం..365 రోజులు సెలవులు తీసుకోండి!

20 Jun, 2022 17:43 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఈ కామర్స్‌ స్టార్టప్‌ 'మీ షో' ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కోసం కొత్త లీవ్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు 365 రోజుల సెలవులు తీసుకోవచ్చు. అంతేకాదు తీసుకున్న సెలవులకు ఫుల్‌ శాలరీ ఇస్తామని ఆఫర్‌ చేసింది. ఈ ఆఫర్‌ పట్ల ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.    

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయా స్టార్టప్‌లు నష్టాల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. కానీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీషో మాత్రం ఉద్యోగుల సంరక్షణే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 'మీ కేర్‌' పేరుతో కొత్త లీవ్‌ పాలసీని అమలు చేసింది. ఈ ఫుల్‌ లీవ్‌ పాలసీలో అర్హులైన ఉద్యోగులకు తీసుకున్న సెలవులకు ఫుల్‌ శాలరీ ఇస్తున్నట్లు తెలిపింది.

ఫుల్‌ శాలరీ
మీ షోలో పనిచేస్తున్న ఉద్యోగి అనారోగ్యానికి గురై దీర్ఘ కాలిక సెలవు తీసుకోవచ్చు.సెలవు తీసుకుంటే ఫుల్‌ శాలరీ ఇవ్వడంతో పాటు అదనంగా ఆర్ధిక సాయం, ఇన్స్యూరెన్స్‌, ఇతర మెడికల్‌ అలెవన్స్‌లను అందిస్తుంది. అదే ఉద్యోగి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే..సదరు ఉద్యోగికి మూడు నెలల పాటు జీతంలో 25శాతం చెల్లిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కాకుండా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల సెలవు పెడితే మాత్రం శాలరీ పే చేయమని స్పష్టం చేసింది.

మా లక్ష్యం అదే 
మీషోలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కొత్త లీవ్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగి, లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వారి సంరక్షణ కోసం సెలవులు తీసుకునేందుకు వెనకాడకూడదు'అని మీషో చీఫ్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. అయితే తాము తెచ్చిన ఈ పాలసీ ఎక్కువ మంది ఉద్యోగులు ఉపయోగించుకోకపోవచ్చు. కానీ ఈ పాలసీ ప్రభావం సంస్థపై చూపుతుందని అన్నారు.

చదవండి👉 అతిపెద్ద సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘మీ షో యాప్‌’ తెర వెనుక కథ!!

మరిన్ని వార్తలు