ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!

7 Feb, 2022 16:01 IST|Sakshi

ప్రముఖ సోషల్ ఈ-కామర్స్ యునికార్న్ కంపెనీ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కంపెనీ ఉద్యోగులు పని చేయొచ్చు అని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రే తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. "మేము శాశ్వతంగా సరిహద్దులేని పని విధానాన్ని అవలంబిస్తున్నాము. ఇక ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు" అని తెలిపారు.

"ఈ అనిశ్చిత ప్రపంచంలో, వ్యాపార వృద్ధి వాస్తవానికి స్థితిస్థాపక & ఉత్పాదక శ్రామిక శక్తిపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించడానికి మేము బహుళ నమూనాలను అధ్యయనంచేశాము!" అని ఆయన అన్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక భద్రత పని చేసే స్థానం కంటే ముఖ్యమని వ్యాపార నాయకులు అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీషో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్న కార్యాలయాలను తెరుస్తుందని, ప్రధాన కార్యాలయం బెంగళూరులో కొనసాగుతుందని ఆత్రే తెలిపారు. 

మీషో 
"మీషో".. సప్లయర్స్‌, రీసెల్లర్స్‌, కస్టమర్స్‌ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్‌ బ్రాండెడ్‌ ఫ్యాషన్‌, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్‌ ఇచ్చి వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు. సోషల్‌ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్‌నెస్‌, పెట్‌ సప్లైయిస్‌, ఆటోమోటివ్‌ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం.

(చదవండి: పలు కార్ల మోడళ్లపై తగ్గింపును ప్రకటించిన హోండా మోటార్స్)

మరిన్ని వార్తలు