క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం

13 Nov, 2021 21:10 IST|Sakshi

నలువైపుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్న క్రిప్టో కరెన్సీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు మన దేశంలోనే ఉన్నారు. దీంతో క్రిప్టో కరెన్సీపై ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

క్రిప్టోకరెన్సీ లావాదేవీలు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్‌ వేదికగా జరిగే ఈ వ్యవహరంలో ఎవరి జోక్యం లేకుండా పోయింది. దీంతో క్రిప్టోలో పెట్టుబడులు మంచిది కాదనే ప్రచారం జరుగుతున్నా.. క్రిప్టో వ్యాప్తి ఆగడం లేదు. దీంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఏ తరహా సూచనలు ఇవ్వాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగినట్టు ఏఎన్‌ఐ వెల్లడించింది.

క్రిప్టోకరెన్సీపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో బిట్‌ కాయిన్‌ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. బిట్‌కాయిన్‌ కుంభకోణంపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టును కోరుతోంది. మరోవైపు బిట్‌కాయిన్‌ వివాదం రోజురోజుకి ముదరడంతో కర్నాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పలతో పాటు కర్నాటక బీజేపీ చీఫ్‌ నళీని కుమార్‌లు అత్యవసర సమావేశం జరిపారు.

మార్కెట్‌లో బిగ్‌ప్లేయర్లు, ప్రభుత్వాల జోక్యం లేకుండా పూర్తిగా బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. మార్కెట్‌ను ఎవరూ కృత్రిమంగా ప్రభావితం చేయలేకపోవడం ఇందులో సానుకూల అంశం. అయితే సైబర్‌ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుడులకు ఎటువంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అందువల్ల గతంలో సుప్రీం కోర్టు క్రిప్టోపై నిషేధం విధించింది. చైనాతో సహా పలు దేశాలు క్రిప్టో లావాదేవీలను ప్రోత్సహించడం లేదు.

ప్రభుత్వాల వైఖరి ఎలా ఉన్నా బిజినెస్‌ మ్యాగ్నెట్స్‌ క్రిప్టో కరెన్నీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్‌ క్రిప్టో కరెన్సీకి అనధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండగా తాజాగా యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ సైతం క్రిప్టోలో తాను ఇన్వెస్ట్‌ చేసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. 
 

చదవండి:యాపిల్‌ ఫోన్‌ లాంటిదే క్రిప్టో కరెన్సీ- టిమ్‌ కుక్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు