షిప్పింగ్‌ కార్పొరేషన్‌ వేటలో మేఘా

8 May, 2021 01:16 IST|Sakshi

తదుపరి దశ బిడ్డింగ్‌కు అర్హత

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో (ఎస్‌సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (ఎంఈఐఎల్‌) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్‌సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్‌ లిస్ట్‌ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్‌ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది.

ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్‌సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్‌ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్‌ క్యారియర్లు, క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్లు, ప్రొడక్ట్‌ ట్యాంకర్స్, కంటైనర్‌ వెసెల్స్, ప్యాసింజర్‌/కార్గో వెసెల్స్, ఎల్‌పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు