రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్‌’ ప్రాజెక్ట్‌

20 Apr, 2021 05:34 IST|Sakshi

3 రాష్ట్రాల్లో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌

మొత్తం 11 లక్షల గృహాలకు కనెక్షన్లు

ఆరేళ్లలో 250 సీఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్‌జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్‌పీజీతో పోలిస్తే పీఎన్‌జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ పనులను మేఘా గ్యాస్‌ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది.

2021 డిసెంబర్‌ నాటికి..
మేఘా గ్యాస్‌ 7 జియోగ్రాఫికల్‌ ఏరియాల్లో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్‌ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్‌ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్‌ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్‌లో మొత్తం 250 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్‌ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ హెడ్‌ పి.వెంకటేశ్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

మరిన్ని వార్తలు